గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' సినిమా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల (గ్రాస్)కు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. "కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ థియేటర్‌లలో విడుదలైంది. గేమ్ ఛేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ సాధించింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది" అని మేకర్స్ ట్వీట్ చేశారు. ఇక ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా 1.3 మిలియన్లకు పైగా టికెట్ల విక్రయం జరిగినట్లు సంస్థ వెల్లడించింది. వారాంతం కావడం, సంక్రాంతి సెలవులు రావడంతో ఈ టికెట్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.