కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ఎన్నో వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించడంతో, కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనేక అవాంతరాలు, వాయిదాల తర్వాత ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. 1975-1977 మధ్య దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీ ఇందిరా గాంధీ పాలనలో చీకటి రోజులుగా పరిగణించబడింది. ఈ ఎమర్జెన్సీకి కారణమైన పరిస్థితులు ఏమిటి? ఇందిరా గాంధీ కొడుకు సంజయ్ గాంధీ పాత్ర ఏంటి? ఆ ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధీ తిరిగి ప్రజాభిమానాన్ని పొంది అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఇవే అంశాలు ఈ సినిమా కథగా నిలుస్తాయి. మొదట్లో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ, ఎమర్జెన్సీ కారణంగా చివరికి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాను 2 గంటల 26 నిమిషాల నిడివితో తీశారు. ఇందులో కంగనా రనౌత్ తన పాత్రను అత్యంత నిష్ణాతంగా పోషించింది. రాజకీయాలతో పాటు ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం కూడా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇక ఇందిర గాంధీగా కంగన రనౌత్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. మాజీ ప్రధాని నడిచే తీరు, ముఖ కవలికలు, బాడీ లాంగ్వేజ్, ఆహార్యం లాంటి విషయాల్లో చక్కటి శ్రద్దను తీసుకొన్నారు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా కంగన తన సత్తాను చాటుకొన్నారు. ముఖ్యంగా సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చే సీన్లలో ఆమె నటన భావోద్వేగానికి గురి చేస్తుంది. అమెరికాలో రాష్ట్రపతి నిక్సన్‌తో వ్యవహరించే సన్నివేశాలు గూస్ బంప్స్ వస్తాయి. అటల్ బీహారి వాజ్‌పేయ్‌గా శ్రేయాస్ తల్పాడే, లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, జగ్జీవన్ రామ్‌గా సతీష్ కౌశిక్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షాగా మిలింద్ సోమన్, తన అంతరంగీకురాలు పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరీ, మురార్జీ దేశాయ్‌గా అశోక్ చాబ్రా, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ పాత్రలను బ్రహ్మండంగా తీర్చి దిద్దారు. ఇందిరా రాజకీయ సలహాదారు ఆర్కే ధావన్ పాత్రలో దర్శన్ పాండ్యా తన పాత్రతో చెలరేగిపోయాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ రోల్స్‌కు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అత్యంత బలంగా నిలిచాయి. అలాగే ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా చక్కగా ఉంది. జీవీ ప్రకాశ్ పాటలు అందించగా.. సంచిత్, అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేయడమే కాకుండా కథలో లీనమయ్యేందుకు దోహదపడ్డాయి. జీ స్టూడియో, మణికర్ణిక అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఇందిరా గాంధీ జీవితం ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో విషాదాలు, అలాగే వివాదాలతో ముడిపడి ఉన్నది. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నేతకు ఎదురవ్వని సవాళ్లు ఈ మాజీ ప్రధానిని చుట్టుముట్టాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం వల్లే ఆమె ఉక్కు మనిషి అనే పేరు తెచ్చుకొన్నది. ప్రతిపక్షాలు, స్వపక్షం అనే తేడా లేకుండా తనకు పోటీగా నిలిచిన ప్రతీ ఒక్కరిని తనదైన శైలిలో పక్కకు తప్పించిన నేత. అలాంటీ నేత జీవితాన్ని పక్కాగానే తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఎజెండా ప్రభావంతో ఆమె పాత్రను చీప్‌గా, అగౌరవ పరిచే విధంగా చిత్రీకరించడం అభ్యంతరకరంగా కనిపిస్తాయి. ఈ కంప్లయింట్స్ పక్కన పెడితే.. కంగన ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కంగన పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా థియేటర్‌లోనే చూడాలి. దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఈ సినిమా తప్పకుండా మంచి అనుభూతినే కాకుండా థ్రిల్లింగ్ మూమెంట్స్ పంచుతుంది.