సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి ఘటనపై ఊర్వశి రౌతేలా స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంత తీవ్రమైన దాడి జరిగిన సమయంలో డాకు మహారాజ్ సక్సెస్ వల్ల తనకు వచ్చిన బహుమతుల లిస్ట్ చెబుతూ.. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమే అన్నట్లుగా ఆమె మాట్లాడింది. వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడామె క్షమాపణలు చెప్పింది.డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ సరసన నటించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా శుక్రవారం (జనవరి 17) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ చెప్పింది. ఆ సమస్య తీవ్రతను తాను అర్థం చేసుకోలేకపోయినట్లు చెప్పింది. "డియర్ సైఫ్ అలీ ఖాన్ సర్.. మీకు క్షమాపణ చెబుతూ రాస్తున్న పోస్ట్ ఇది.మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు ఇప్పుడే తెలిసింది. డాకు మహారాజ్ సక్సెస్, తర్వాత నేను అందుకున్న బహుమతుల ఉత్సాహంలో నన్ను నేను మరచిపోయి అలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుగా ఉంది. నా క్షమాపణను స్వీకరించండి. మీ దాడి తీవ్రత ఏంటో తెలిసింది. అలాంటి సమయంలో మీరు చూపించిన తెగువ చాలా గొప్పది" అని ఊర్వశి రాసింది.