సినీ పరిశ్రమలో సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనతో రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు కుటుంబం అనేలా వివాదం కొనసాగుతోంది.ఆ వివాదం ఇంకా సద్దుమణగలేనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాను నిర్మిస్తున్న సినిమా విడుదల సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. 'మాకు అవసరం లేదు' అని కొట్టిపారేయడంతో ఆ వ్యాఖ్యలు కలకలం రేపాయి.చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, అక్కినేని నాగచైతన్య జోడీగా నటించిన సినిమా 'తండేల్'. ఈనెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్‌లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన సినిమా వేడుకలో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సంభాషిస్తున్న క్రమంలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అంశం ప్రస్తావనకు రాగా అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు అడగలేదా? అని మీడియా ప్రశ్నించగా.. అల్లు అరవింద్ స్పందిస్తూ.. 'తండేల్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరలు పెంచాలని అడగలేదు. అడగాల్సిన అవసరం కూడా లేదు' అని ప్రకటించారు. 'బెనిఫిట్ షో అనుమతి కూడా అడగలేదు. మాకు అంత బెనిఫిట్ కూడా అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణతోపాటు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యాఖ్యలతో అల్లు అరవింద్ తెలంగాణ ప్రభుత్వంతో తగువులు ఎందుకు? అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 'ధరలు, బెనిఫిట్ షో' అనుమతులకు రేవంత్ రెడ్డిని అడగాల్సిన అవసరం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాలను అల్లు అరవింద్ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలతో అల్లు కుటుంబం 'సంధ్య థియేటర్ తొక్కిసలాట' అంశాన్ని ఇంకా మరచిపోలేదని.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
![]() |
![]() |