by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:01 PM
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం తిరుపతి వైసీపీ ఇంఛార్జిగా ఉన్నారు భూమన అభినయ్ రెడ్డి. స్నేహితులతో కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న భూమన అభినయ్ రెడ్డి.. 5,364 మీటర్ల ఎత్తులో వైసీపీ జెండాను ఎగరవేశారు. అనంతరం అత్యున్నత శిఖరంపై సాహస యాత్ర చేసి వైసీపీ జెండా ఎగరవేయడం ఆనందంగా ఉందని భూమన అభినయ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ జెండా మాదిరిగానే వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ జెండా తప్పకుండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు
తమ బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత సాహసంతో అధిరోహించిందన్న భూమన అభినయ్ రెడ్డి.. తాము కష్టపడి వైసీపీ జెండాను ఎగురవేసినట్టుగా, వైసీపీ కార్యకర్తలు కూడా కష్టాలను అధిగమించి గర్వంగా వైసీపీ జెండాను రెపరెపలాడించాలని కోరారు. మరోవైపు 2024 ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. తాను కాదని తన తనయుణ్ని ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వారికి ఊహించని పరాజయం ఎదురైంది. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లి టికెట్ సాధించుకున్న ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి వేవ్ కనిపించడంతో ఆరణి శ్రీనివాసులు కూడా ఘన విజయం సాధించారు.
అయితే వైసీపీ అధిష్టానం పార్టీని బలోపేతం చేసేందుకు భూమన అభినయ్ రెడ్డిని.. తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా నియమించింది. అలాగే భూమన కరుణాకర్ రెడ్డిని వైసీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయానికి అనుగుణంగా కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గంలో పార్టీని పటిష్టపరిచే ప్రయత్నాలు సాగిస్తూనే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీరును, సీఎం చంద్రబాబు విధానాలను ఎండగడుతున్నారు.
Latest News