by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:51 PM
రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే జగన్ ఒక్కరేనా?.. విజయమ్మ, షర్మిల కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైఎస్సార్ కుటుంబంలో వారిపై అసభ్య పోస్టులు పెడితే ఆ కుటుంబం కానట్లు పట్టించుకోరా? అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బాలినేని కౌంటరిచ్చారు. తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని.. వైఎస్సార్‌పై అభిమానంతో, ఆయన మరణం తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవుల్ని వదులుకుని వైఎస్సార్‌సీపీలో చేరానని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టినట్లు తాను జనసేన పార్టీలో చేరిన రోజే చెప్పానన్నారు.
తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసం మాట్లాడుతున్నట్లు చెవిరెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు బాలినేని. తాను ఎవరి మెప్పు కోసం పనిచేయడం లేదన్న విషయాన్ని చెవిరెడ్డి గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. తాను ఎవర్నీ విమర్శించనని చెప్పానని.. తనపై విమర్శలు చేస్తే మాత్రం అన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తుందన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని.. ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు సిద్థమా అని సవాల్ చేశారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. తాను కనుక వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు బాలినేని. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో ఎంపీగా టికెట్ ఇస్తారా?.. అలా చేయడం తనకు నచ్చలేదు అన్నారు. అందుకే దానికి అంగీకరించలేదని.. తిట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసన్నారు. అదానీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో రూ.1,750 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని.. తాను గత ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా ఉన్నాని.. అందుకే ఏం జరిగిందో మాత్రమే చెప్పానన్నారు. సెకీతో ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. సీఎండీ ఫైల్ కూడా తన దగ్గరకు రాలేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి.
Latest News