by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:52 PM
ఉత్తరాంధ్ర టు హైదరాబాద్.. అక్కడ తీగ లాగితే ఇక్కడ డొంక మొత్తం కదిలింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ దందాపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో డొంక కదిలింది.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బాలాజీ గోవింంద్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.. వారిని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.
బాలాజీ గోవింద్ ఇంటర్‌లోనే చదువు మానేసి హైదరాబాద్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఇంతలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో (ఆంధ్రా-ఒడిశా) బోర్డర్‌లోని చిత్రకొండ అటవీ ప్రాంతానికి చెందిన గంజాయి సాగు చేసే రైతులతో పరిచయం ఏర్పడింది. అప్పుడు తన గంజాయి బిజినెస్ ప్లాన్‌ను అమలు చేశాడు.. గంజాయి సాగు చేస్తే తాను పెట్టుబడి సాయం చేస్తానని చెప్పాడు.. అలగే పండించిన గంజాయిని తనకు రూ.1500కే కేజీ విక్రయించాలని రైతులను కోరాడు. ఇలా రైతులకు అవసరమైన డబ్బులు సాయం చేసి.. గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. రూ.1500కు తీసుకొచ్చిన గంజాయిని కేజీ రూ.5వేల చొప్పున విక్రయించేవాడు.
ఇలా తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి విక్రయించి.. భారీగా సంపాదించాడు. గోవింద్ సంపాదనను చూసి.. అతడి స్నేహితులు ప్రకాశ్‌కుమార్, మోహన్‌రావు, దుర్గా హరిప్రసాద్, రమణ, మరో ఇద్దరుముఠాగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి గంజాయి వ్యాపారాన్ని విస్తరించారు.. పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తగా గంజాయిని తీసుకొచ్చేవారు. చిత్రకొండ అటవీ ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసే గోవింద్ ముఠా.. అక్కడి నుంచి తరలించేందుకు కూలీల సాయం తీసుకుంటున్నారు. ఎవరికీ దొరక్కుండా కూలీల సాయంతో రహస్య మార్గాల ద్వారా 20 కి.మీ. మేర కాలినడకన గంజాయి మూటల్ని తీసుకొచ్చి గోవింద్‌కు అప్పగించేవాళ్లు.
గోవింద్ ముఠా గంజాయిని అక్కడి నుంచి లంబసింగికి తీసుకొచ్చి.. జాగ్రత్తగా దాచేవాళ్లు. ఎవరైనా గంజాయి కావాలని అడిగితే అక్కడి నుంచి సరఫరా చేసేవారు. అయితే ఈ గ్యాంగ్ హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను బట్టి రోడ్డు, రైలు మార్గాల ద్వారా లగేజీ బ్యాగుల్లో దాచేసి, కూలీల్లా వాహనాల్లో ఎక్కి గంజాయిని రహస్యంగా తీసుకెళ్లి విక్రయించేవాళ్లు. ఈ గ్యాంగ్ హైదరాబాద్‌లో కేజీ గంజాయిని రూ.25 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గోవింద్ గ్యాంగ్ 2020 నుంచి గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ పోలీసులకు ఈ గ్యాంగ్ దొరికిపోవడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.
Latest News