by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:02 PM
ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 40 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మార్చిలోగా శతశాతం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తొలుత కలెక్టర్ నియోజకవర్గాలు, మండలాల వారీగా చేపట్టిన పనులను వివరించారు. జిల్లాలో ఇసుక సమస్య లేదని, పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే అప్‌లోడ్ చేస్తే చెల్లింపులు ఆలస్యం లేకుండా జరుగుతాయన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పరిపాలన సాగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తేమశాతం ఎక్కువ ఉన్నా, ధాన్యం రంగుమారినా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడాల్సిన పనే లేదని స్పష్టం చేశారు. పలాసలో టీడీపీ నాయకుడి హత్యకు సుపారీ ఇవ్వడం వంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. ఇటువంటి సంస్కృతి ఇంతవరకు మన జిల్లాలో లేదని, దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డ్వామా పీడీ సుధాకర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుధాకర్, జీఎస్టీ కమిషనర్ రాణీమోహన్, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఈ భాషా, పంచాయతీరాజ్ ఈఈలు, మండల స్థాయి ఇంజనీర్‌లు, తదితరులు హాజరయ్యారు.
Latest News