by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:08 PM
రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కశింకోట మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం ఇక్కడ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పనికూడా చేయకుండా పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలో అనకాపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.65 కోట్లు మంజూరు చేసిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులన్నీ ఆపేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ఎడమ కాలువతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు. వైసీపీ పాలనలో మరమ్మతులకు నోచుకోని రోడ్లన్నింటినీ అభివృద్ధి చేస్తున్నామని, సంక్రాంతినాటికి పనులు పూర్తి చేసేందుకు రూ.850 కోట్లు మంజూరు చేశామని వివరించారు. మరో రెండు నెలల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి 16,345 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని, యువత గంజాయికి దూరంగా ఉండాలని చెప్పారు.
Latest News