by Suryaa Desk | Tue, Dec 24, 2024, 08:08 PM
ఆ రెండు కుటుంబాలు ఒకే ప్రాంతంలో ఉండేవి. ఒకరికొకరు బాగా తెలుసు. ఈక్రమంలోనే ఓ కుటుంబానికి చెందిన అమ్మాయిని.. మరో కుటుంబంలోని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఇందుకోసం చర్చలు కూడా చేశారు. త్వరలోనే పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా అమ్మాయి తరఫు వాళ్లు పెళ్లి వద్దని అబ్బాయి వాళ్లకు చెప్పేశారు. అదే వారు చేసిన తప్పు అయింది. పెళ్లై పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన తమ కూతురు అన్యాయంగా ఈ లోకం వీడి వెళ్లాల్సి వచ్చింది. అసలీ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధా నగర్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల వీరేంద్రకు.. ఘజియాబాద్‌లోని విజయ్ నగర్‌కు చెందిన రాజేశ్ కుమార్ కుమార్తె.. 23 సంవత్సరాల రాఖీతో ఇటీవలే పెళ్లి ఖాయమైంది. అయితే వీరిద్దరి కుటుంబాలు గతంలో మీరట్‌లో కలిసే ఉండేవి. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే వీరిద్దరికి పెళ్లి నిర్ణయించారు పెద్దలు. పిల్లలకు కూడా ఒకరికొకరు నచ్చడంతో మంచి రోజు చూసి పెళ్లి కూడా చేయాలనుకున్నారు.
అయితే వీరేంద్ర చిన్నప్పటి నుంచి బాగా చదవడంతో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించాడు రాఖీ తండ్రి రాజేశ్ కుమార్. ఈక్రమంలోనే కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే ఇటీవలే రాసిన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో వీరేంద్ర తప్పాడు. ఆ విషయం తెలుసుకున్న రాజేశ్ కుమార్.. వీరేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో రాఖీపై ప్రేమతో ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు చాలానే ప్రయత్నించాడు వీరేంద్ర. కానీ అవన్నీ విఫలం అవ్వడంతో తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాడు.
ఇక ప్రభుత్వం ఉద్యోగం వచ్చేలా లేదని భావించిన అతడు.. రాఖీని పెళ్లి చేసుకోమని అడిగేందుకు వారి ఇంటికి వెళ్లాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. రాఖీ తల్లి అతడిని అడ్డుకుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే తమ కూతురిని ఇస్తామని చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన వీరేంద్ర.. ఆ కోపాన్ని తనకు కాబోయే భార్య మీద చూపించాడు. అక్కడే ఉన్న ఓ కత్తి తీసుకుని రాఖీపై దాడికి పాల్పడ్డాడు. విపరీతమైన ఆవేశంలో ఉన్న అతడు మొత్తంగా 27 సార్లు ఆమెను కత్తితో పొడిచాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తల్లిపైకి కూడా కత్తి దూయగా ఆమె బయటకు పారిపోయింది. స్థానికులను పిలిచింది.
అలా స్థానికులు పోగవుతుండగా.. వీరేంద్ర పారిపోయాడు. వెంటనే వారంతా కలిసి తీవ్ర గాయాలపాలైన రాఖీని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. చికిత్సపొందుతూ రాఖీ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. జరిగిన విషయం తెలుసుకుని వీరేంద్రను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.