by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:05 PM
డి.హీరేహాళ్ మండకేంద్రంలో గుదిబండలా మారిన నేషనల్ హైవే ఫ్లైఓవర్ సమస్య పరిష్కారానికి ఎంపీలతో కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళతానని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. గ్రామస్థులు గురువారం ఫ్లైఓవర్ సమస్యపై స్థానికంగా సమావేశం నిర్వహించారు. ఇందులో బళ్లారి ఎంపీ తుకారంతో పాటు కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ.. ఈ సమస్యకు ఢిల్లీలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలకేంద్రాన్ని విడదీసేలా మట్టితో కాకుండా పిల్లర్ల విధానం ద్వారా ఫ్లైఓవర్‌ను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారన్నారు. వైసీపీ పాలనలో అప్పటి పాలకులు ప్రజాభీష్టాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే సమస్య జఠిలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాదన దశలోనే స్థానికులను సమావేశ పరచి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. ప్రస్తుతం గ్రామస్థులు వ్యక్తపరుస్తున్న సమస్య కేంద్రం పరిధిలోనే పరిష్కారం కావాలన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని, అందులో అనంతపురం, బళ్లారి ఎంపీలతో పాటు మన రాష్ట్రం నుంచి ఎంపికైన కేంద్ర మంత్రుల సహకారంతో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కాలవ కేక్ కట్ చేశారు. సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు, టీడీపీ మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, క్లస్టర్ ఇనచార్జి మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News