by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:06 PM
ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అధికారులు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఆదరణ బాగుంటే కోచ్‌ల సంఖ్య పెంచడం, లేకుంటే తగ్గించడాన్ని ‘ట్రైన్ సెట్’గా వ్యవహరిస్తారు. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య డిమాండ్ అధికంగా ఉండడంతో వాటి కోచ్‌ల సంఖ్యను వారం క్రితం 16 నుంచి 20కి పెంచారు. విశాఖపట్నం-దుర్గ్‌కు ఆక్యుపెన్సీ పెద్దగా లేకపోవడంతో శుక్రవారం నుంచి కోచ్‌లను తగ్గించబోతున్నారు.నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు...ఇలా ‘నాలుగు గుణిజాల’తో వందేభారత్ రైళ్లను నడుపుతున్నారు. విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైలు ఎనిమిది కోచ్‌లతో నడుస్తోంది. ఆక్యుపెన్సీ బాగానే ఉండడంతో వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు గత ఏడాది సెప్టెంబరు 16న వందే భారత్ ప్రారంభించారు. దీనికి 16 కోచ్‌లు పెట్టారు. అయితే ఆదరణ చాలా తక్కువగా ఉంది. విశాఖ నుంచి దుర్గ్ (20830)కు 40 నుంచి 45 శాతమే ఆక్యుపెన్సీ ఉంటోంది. అటు నుంచి వచ్చేటపుడు ఆ రైలు (20829)లో దుర్గ్ నుంచి రాయగడ వరకు 50 శాతం వరకు, అక్కడి నుంచి విశాఖకు కేవలం 20 నుంచి 25 శాతమే ఉంటోంది. ఎక్కువ సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి సాధారణ రైళ్లలో టికెట్ ధర కేవలం రూ.145 కాగా, వందే భారత్ ఎక్కితే రూ.565 చెల్లించాల్సి వస్తోంది. దాంతో రాయగడ నుంచి విశాఖ వరకూ తెలుగువారు ఎవరూ ఈ రైలును ఎక్కడం లేదు. దీనిపై చాలాకాలంగా రైల్వే అధికారులు మథన పడుతున్నారు. ‘ట్రైన్ సెట్’ చేసుకోవచ్చునని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక్కడి అధికారులు కోచ్‌ల సంఖ్యను సగానికి కుదించారు. అంటే కేవలం ఎనిమిది కోచ్‌లతోనే విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు నడపాలని నిర్ణయించారు. దీనిని శుక్రవారం నుంచే అమలు చేస్తారు. ఇందులో ఏడు కోచ్‌లు చైర్ కార్ సౌకర్యంతో ఉంటాయి. ఒక్కో దాంట్లో 70 సీట్లు ఉంటాయి. ఒక కోచ్ మాత్రం ఎగ్జిక్యూటివ్ చైర్ సదుపాయాలతో ఉంటుంది. ఇందులో సీట్లు కేవలం 40 మాత్రమే ఉంటాయి. రిజర్వేషన్ వివరాలు పరిశీలిస్తే 24వ తేదీ నాటికి చైర్ కారు సీట్లు 307 ఖాళీ ఉన్నాయి. ఏడు కోచ్‌లకు మొత్తం సీట్లు 490 కాగా 183 బుక్ అయ్యాయి. ఎగ్జిక్యూటివ్ చైర్స్ చూస్తే 24వ తేదీకి 29 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే 40లో కేవలం 11 మాత్రమే రిజర్వ్ అయ్యాయి. ఇలా ఆదరణ తక్కువగా ఉన్నందున సగానికి కోచ్‌లు తగ్గించామని, దీనిని కూడా కొన్నాళ్లు పరిశీలించి అవసరమైతే మరిన్ని కోచ్‌లు తగ్గించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఖాళీగా ఉండే ఈ కోచ్‌లను డిమాండ్ ఉన్న మార్గంలో సెట్ చేస్తామని వివరించారు. పూర్తిగా విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు రద్దు చేయడం అంత వేగంగా కుదరదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
Latest News