by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:15 PM
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అబద్ధాలు చెప్పలేదన్న విజయసాయిరెడ్డి వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు అబద్ధం చెప్పారని మీడియా ప్రశ్నించింది. దీనిపై మొదటిసారి విజయసాయి స్పందిస్తూ.. వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి విషయం చెప్పారని, వెంటనే తాను ఆశ్చర్యపోయానన్నారు. వెంటనే పులివెందులలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశానన్నారు. అవినాష్ రెడ్డి పక్కన ఉండే ఓ వ్యక్తి గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారనే విషయాన్ని తనకు చెప్పారని, అదే సమాచారాన్ని మీడియాకు తెలియజేశానన్నారు. గుండెపోటుతో చనిపోయారని అవినాష్ రెడ్డి చెప్పారా అని పాత్రికేయులు అడగ్గా.. దీనిపై గుచ్చిగుచ్చి అడగవద్దన్నారు. తాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, ఆయన పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చిన మాట వాస్తవమన్నారు. అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తి చెప్పిన విషయం తాను మీడియాలో చెప్పానన్నారు.
Latest News