by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:28 PM
శ్రీకాకుళం జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సిబ్బంది జాడ కనిపించడం లేదు. దీంతో అటవీ ప్రాంతంలో కలపతో పాటు అడవి పందులు, జింకలు తదితర వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సరుబుజ్జిలి, బూర్జ, ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉన్నది. ఈ అడవుల్లో వివిధ జాతులకు చెందిన వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. ఆహారం, తాగునీటి కోసం మైదాన ప్రాంతాలకు వచ్చి వెళ్తుంటాయి. అటువంటి సమయంలో వేటగాళ్ల ఉచ్చుకి బలవుతున్నాయి. ఎటువంటి అనుమతి లేని తుపాకులు, వలలు, నాటుబాంబులతో కొంతమంది వ్యక్తులు వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని విక్రయించడం వ్యాపారంగా మార్చుకున్నారు. అంతర్రాష్ట్ర వేటగాళ్లు ఒకప్పుడు జిల్లాలోని గిరిజన, మైదాన ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా అడవి పందులు, జింకలు, కనుజులు తదితర జంతువులను వేటాడేవారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి వాటి మాంసాన్ని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు అటవీ జంతువులను వేటాడేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒడిశా పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఛత్తీ్‌సగఢ్ ప్రాంతాలకు చెందిన కొంతమంది వేటగాళ్లు ముఠాగా ఏర్పడ్డారు. వన్య ప్రాణుల వేట మాంసం వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. వన్య ప్రాణులను తుపాకులతో వేటాడి నేరుగా వాహనాల్లో పలాస, టెక్కలి, నరసన్నపేట, హిరమండలం, సరుబుజ్జిలి పాలకొండ ప్రాంతాల్లో ముందుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా కేజీల చొప్పున మాంసాన్ని విక్రయిస్తున్నారు. అడవి పంది మాంసం కేజీ రూ.300, జింక రూ.800, కుందేళ్లు రూ.500, కణుజులు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. అటవీ జంతువులు కావడం.. తక్కువ ధరకు మాంసం లభిస్తుండడంతో కొంతమంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Latest News