by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:56 PM
76వ గణతంత్ర దినోత్సవానికి భారతదేశం ముస్తాబైంది. దేశ రాజధాని ఢిల్లీ సహా అన్నీ రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాలు ఎగరవేయనున్నారు. ఇప్పటికే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఇరురాష్ట్రాల అధికారులు పూర్తి చేశారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే సాయుధ దళాల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి.ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ప్రతి ఏటాలాగానే ఈ ఏడాది కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ (ఆదివారం) ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ప్రజలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ముందుగా స్టేడియం వద్దకు చేరుకుని సాయుధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎన్‌సీసీ దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు, పోలీసులు, భారత ఆర్మీ పెద్దఎత్తున కవాతు నిర్వహిస్తాయి.అనంతరం ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించగా గౌవర్నర్, ముఖమంత్రి, ప్రజలు తిలకిస్తారు. రిపబ్లిక్ డే వేడుకలు సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరవ్వాలని అనుకునేవారు తమ పాసులతో ఉదయం 7:45 లోపే స్టేడియం వద్దకు చేరుకోవాలి. ఏఏ పాస్‌లు ఉన్నవారు ఎంజీ రోడ్డులోని గేట్ నంబర్ 3 నుంచి ఇందిరాగాంధీ స్టేడియం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఏ-1 పాస్‌లు కలిగి ఉన్నవారు గేట్ నంబర్ 4 ద్వారా వెళ్లాలి. అలాగే బీ-1 పాస్‌లు ఉంటే ఆరో నంబర్ గేట్, విద్యార్థులు, ప్రజలు 5, 6 గేట్ల ద్వారా లోపలికి వెళ్లాలి.
Latest News