by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:01 PM
జీవీఎంసీ మేయర్ మార్పుపై కూటమి ప్రజా ప్రతినిధులు, నేతలు తర్జనభర్జన పడుతున్నారు. మరో రెండు నెలలకు గొలగాని వెంకటహరికుమారి మేయర్ పీఠం అధిష్ఠించి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పుడు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం లభిస్తుంది. కౌన్సిల్‌లో ప్రస్తుతం కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నందున...ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కొంతమంది అభిప్రాయపడు తున్నారు. మరికొందరు మాత్రం ఏడాది కాలానికి మేయర్‌ను మార్చడం అనవసరమని, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందంటూ వాదిస్తున్నారు.జీవీఎంసీకి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. 98 వార్డులకుగానూ అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ 60 వార్డులను గెలుచుకుంది. ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురు కూడా వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో 11వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన గొలగాని హరివెంకటకుమారిని మేయర్‌గా ఎంపిక చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. దీనిప్రభావం జీవీఎంసీ కౌన్సిల్‌పై పడింది. ఇండిపెండెంట్లుగా గెలిచి వైసీపీలో చేరిన నలుగురితోపాటు వైసీపీకి చెందిన సుమారు 15 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు. దీంతో కౌన్సిల్‌లో వైసీపీ బలం 40కి పడిపోగా, కూటమి బలం 55కి పెరిగింది. వీరుకాకుండా జీవీఎంసీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను, పార్లమెంటు స్థానాలను కూటమి కైవసం చేసుకోవడంతో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా మరో పది మంది ఉన్నారు. దీంతో మేయర్ గొలగాని హరివెంకటకుమారిని గద్దె దింపి, తమ కార్పొరేటర్‌ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు సరిపడా బలం కూటమికి చేకూరింది. కానీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలంటే ఎన్నికై కనీసం నాలుగేళ్లు పూర్తవ్వాలనే నిబంధన మునిసిపల్ చట్టంలో ఉంది. ఇది అవిశ్వాసం పెట్టేందుకు అడ్డంకిగా మారింది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థల చైర్మన్‌లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు కలిగేలా మునిసిపల్ చట్టానికి సవరణ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అందుకు సీఎం చంద్రబాబునాయుడు ససేమిరా అన్నారు. ఇక జీవీఎంసీ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చి నాటికి కౌన్సిల్ ఎన్నిక జరిగి నాలుగేళ్లు పూర్తవుతుంది. దీంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి అడ్డంకి తొలగిపోతుంది. ఈ నేపథ్యంలో మేయర్ మార్పుపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
Latest News