by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:02 PM
విశాఖ పరిధిలోని రోలుగుంట మండలంలోని పెదగరువు గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు.మండలంలోని అర్ల పంచాయతీ శివారు పెదగరువులో 12 కుటుంబాలకు చెందిన 70 మంది కొందు ఆదివాసీలు నివాసముంటున్నారు. వారు 2018-19 ఏడాదిలో మూడు నెలల వ్యవసాయ పనులు మానుకుని సొంతంగా నుయ్యి తవ్వుకున్నారు. దీనికి అధికారులు మోటారు, పైపులు ఏర్పాటు చేశారు. ఇటీవల పైపుల ద్వారా బురదనీరు వస్తుండడంతో తాగేందుకు వీలు లేకుండా ఉంది. ఈ నీరు తాగితే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వారు వాపోయారు. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్లకు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కిల్లో సీత, కిల్లో రేష్మ, లక్ష్మి తదితరులు కోరారు.
Latest News