![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:59 PM
గోదావరి జిల్లాలలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎర్రకాలువ పరిధిలో రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2024 జులైలో ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలు, వరదల కారణంగా ఎర్రకాలువ ఉద్ధృతంగా పొంగిపొర్లింది. ఫలితంగా నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. దీంతో రైతులకు అపార నష్టం జరిగింది. ఆ కష్టం నుంచి ఆయా ప్రాంతాల రైతులు ఇంకా తేరుకోలేదు. ఎర్రకాలువ ఉద్ధృతికి సుమారు 14 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. 20 గ్రామాల్లోని సుమారు 4,500 మంది రైతులు నష్టపోయారు. వరి, చెరకు, ఉద్యాన పంటలు వరద ముంపునకు గురయ్యాయి.
ఎర్రకాలువ ముంచెత్తిన సమయంలో ఏపీ మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎర్రకాలువ ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని మాట ఇచ్చారు. రైతులకు ఇన్‌పుట్ సబ్బిడీ అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎర్రకాలువ రైతుల విషయాన్ని పలుసార్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులోనూ ఎర్రకాలువ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అంశం తెరపైకి వచ్చింది. దీంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. పూర్తిగా వరిపంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.17000 అందించనున్నట్లు సమాచారం. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్రకాలువ వరద ప్రభావం నిడదవోలు మండలంలపై ఎక్కువగా పడింది. ఈ మండలంలో భారీగా వరిపంట దెబ్బతిన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
Latest News