|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:21 PM
విజయవాడ, భవానీపురం జోజినగర్ 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వచ్చేవారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో 42 ప్లాట్లకు సంబంధించి కూల్చివేత బాధితులు గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెక్కల కష్టంతో కూలి చేసుకుని సంపాదించుకున్న డబ్బుతో 25 ఏళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకున్నామని, తమకు ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులున్నాయని చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3న వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వైయస్ జగన్ ఎదుట వాపోయారు. అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వైయస్ జగన్ ని వేడుకోగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
Latest News