|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:44 AM
స్కూల్ విద్యార్థుల స్కూల్ బ్యాగులను కూడా వదలకుండా కూటమి నాయకులు అవినీతి దాహార్తిని తీర్చుకుంటున్నారని, రెండు వేలకు పైగా వెచ్చించామని చెబుతున్న స్కూల్ బ్యాగులు నెలరోజులు కాకుండానే చినిగిపోతున్నాయని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాణ్యతను మూడు దశల్లో తనిఖీ చేశామని చెబుతున్నా.. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగులు చినిగిపోతుండటంతో ఇప్పటికీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యాకానుక కింద పంపిణీ చేసిన బ్యాగులనే విద్యార్థులు పాఠశాలలకు తీసుకెళ్తున్నారని వివరించారు. షూలు కూడా విద్యార్థుల సైజుకి సరిపోకపోవడంతో పాతవే వాడుకుంటున్నారని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ పాలనలో 43 లక్షల మందికి రూ. 3,366 కోట్లు ఖర్చు చేసి విద్యాకానుక కిట్ లు పంపిణీ చేస్తే, కూటమి పాలనలో కేవలం 35 లక్షల మందికి మాత్రమే కిట్‌లు పంపిణీ చేశారని రవిచంద్ర చెప్పారు. జగనన్న విద్యాకానుక పథకానికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చడమే కాకుండా కమీషన్ల కోసం అవినీతిమయంగా తయారు చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌నే అవమానించారని మండిపడ్డారు. విద్యాశాఖలో అడుగడుగునా వెలుగుచూస్తున్న అవినీతికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.
Latest News