|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:47 AM
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టామని, అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి మొత్తం కోటి సంతకాలు సేకరించామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర డీజీపీకి రాసిన లేఖలో వెల్లడించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10న జిల్లా కేంద్రాలకు చేరుకోగా, వాటిని ఈనెల 15వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న తాడేపల్లి (విజయవాడ)కి తరలించాల్సి ఉందని తెలిపింది. అందుకే ఆరోజున (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో కూడిన వాహనాల ర్యాలీ, వాటి రవాణాకు అనుమతించాలని, ఆ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర డీజీపీకి వైయస్ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది. ట్రాఫిక్‌కు ఏ ఇబ్బంది కలగకుండా, తమ కార్యక్రమం సజావుగా జరిగేలా, పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందజేస్తామని వెల్లడించింది. అదే విధంగా పోలీసు శాఖ కూడా తమ కార్యక్రమానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరింది. కోటి సంతకాల పత్రాలు విజయవాడ చేరుకున్న తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, ఈనెల 18న రాష్ట్ర గవర్నర్‌ను కలిసి, ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై నివేదించి, ఆ సంతకాల పత్రాలు ఆయనకు సమర్పిస్తారని పార్టీ ఆ లేఖలో వివరించింది. ఆ మేరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
Latest News