|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:59 PM
కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. ఏఐతో కొన్ని ఉద్యోగాలకు ముప్పు లేదని, అయితే అలాంటి ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, సరైన శిక్షణ లేని శ్రామిక శక్తితో ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు భారత్ అడుగులు వేస్తోందని అన్నారు.కొన్ని ఉద్యోగాలు ఏఐతో భర్తీ కావని, వాటిని మనుషులే చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు ప్రస్తుత ఏఐ యుగంలో ప్లంబర్ ఉద్యోగం వెంటనే పోకపోవచ్చని అన్నారు. ఏఐ ప్రభావం లేని ప్లంబింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మరమ్మతు వంటి ఆటోమేషన్ కారణంగా ప్రభావితం కాని కొన్ని ఉద్యోగాల గురించి ఆయన ప్రస్తావించారు. వీటికి కావలసిన నైపుణ్యాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ద్వారా అందడం లేదని అభిప్రాయపడ్డారు.ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ కంటే ఆధునిక ప్లంబింగ్ కోర్సును తాను సంతోషంగా చేస్తానని రఘురాం రాజన్ అన్నారు. ప్లంబర్‌కు అన్ని రకాలుగా వ్యాపార మెలకువలు తెలిసి ఉండాలని అన్నారు. అందుకు అనుగుణంగా సంస్కరణలు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదలకు, భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో రాణించేందుకు పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
Latest News