|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:00 PM
ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి డిసెంబర్16వ తేదీ నియామక పత్రాలు అందజేయనుంది. ఈ విషయాన్ని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లోని పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత శనివారం ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. మరోవైపు డిసెంబర్ 16న జరిగే కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటుగా వారి కుటుంబసభ్యులతో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు డిసెంబర్ 22 నుంచే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించనున్నారు. మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 5,551 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందుకున్నారు. వీరికి 9 నెలల పాటు రెండు దశలుగా శిక్షణ అందిస్తారు. నాలుగున్నర నెలల పాటు తొలుత ట్రైనింగ్ అందిస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆ తర్వాత రెండో విడతగా మరో నాలుగున్నర నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వీరికి పోస్టింగులు ఇస్తారు.
మరోవైపు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి..శిక్షణా కేంద్రాల్లో పోలీసు విధులకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ అందిస్తారు. శారీరక దారుఢ్యంతో పాటుగా, ఆయుధాల వాడకంపైనా అవగాహన కల్పిస్తారు. అలాగేచట్టాలపై అవగాహన కల్పిస్తారు. ప్రజలతో వ్యవహరించే తీరు గురించి వివరిస్తారు. చట్టాలపై అవగాహన కల్పించడం కోసం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తారు. 9 నెలల పాటు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం.. వీరికి పోస్టింగులు అందిస్తారు.