|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:41 PM
కన్నవాళ్లను సరిగా పట్టించుకోని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో.. కన్నతల్లి చనిపోయిన తర్వాత కూడా ఆమె ఇష్టాలను గౌరవించి.. ఆమె ఇష్టానుసారం నడుచుకున్నాడు ఓ కొడుకు. తల్లికి జామకాయలు అంటే ఇష్టమని.. ఆమె ఉత్తర క్రియలకు వచ్చినవారికి జామ మొక్కలు పంపిణీ చేశాడు. ఈ ఘటన అయ్యగారి పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. యేటూరు లక్ష్మీ కాంతమ్మ అనే మహిళ.. ఇటీవల కాలం చేశారు. అయితే తల్లికి జామ కాయలు అంటే ఇష్టమనే కారణంతో.. లక్ష్మీకాంతమ్మ తనయుడు యేటూరు కిషోర్ రెడ్డి.. తల్లి దశదినకర్మలకు హాజరైన వారికి జామ మొక్కలు బహూకరించారు. తల్లి ఉత్తర క్రియలకు వచ్చిన బంధుమిత్రులకు.. జామ మొక్కలు అందించి.. ఆ చెట్టు బతికి ఉన్నంత కాలం.. తన తల్లి గుర్తు ఉండేలా ఓ మంచి ప్రయత్నం చేశాడు.
ఇందుకోసం యేటూరు కిషోర్ రెడ్డి.. ఓ ట్రక్కులో జామ మొక్కలు తెప్పించారు. వాటిని తల్లి ఉత్తర క్రియలకు వచ్చిన బంధుమిత్రులకు అందజేశారు. దీంతో యేటూరు లక్ష్మీకాంతమ్మ ఉత్తర క్రియలకు వచ్చిన బంధుమిత్రులు.. కిషోర్ రెడ్డి చేసిన పనిని అభినందించారు. కన్న తల్లి చనిపోయిన తర్వాత కూడా ఆమె అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను గౌరవిస్తున్నారని ప్రశంసించారు. అలాగే తల్లికి ఇష్టమైన జామ మొక్కను అందించడం ద్వారా.. తమ బంధువుల ఇంట్లోనూ తల్లి స్మృతులు ఎప్పటికీ ఉండేలా మంచి పని చేశాడని అభినందిస్తున్నారు.
చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి, వారికి మోక్షం సిద్ధించడానికి.. కుటుంబసభ్యులు ఇలా ఉత్తర క్రియలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరణించిన వారి గుర్తుగా.. ఉత్తర క్రియలకు హాజరైన వారికి.. ఏదో ఒక వస్తువు అందిస్తుంటారు.
అయితే కిషోర్ రెడ్డి.. తన తల్లికి ఇష్టమైన జామ మొక్కలు అందించి.. తన తల్లికి మరణమనేది లేకుండా చేశాడని గ్రామస్థులు, బంధువులు అభిప్రాయపడుతున్నారు. ఆమె మరణం అంతం కాదని... ఆమె జ్ఞాపకం జామ చెట్లుగా పెరిగి, నీడను, ఫలాలను అందించడమే కాకుండా.. భావితరాలకు కూడా గుర్తుండేలా చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Latest News