|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:55 AM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద అధికార తెలుగుదేశం పార్టీ పిడివాదం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవైటీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని... వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో వెల్లువెత్తిన ప్రజాభిప్రాయమే అందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టాండింగ్ కమిటీ రిపోర్టుపై వీడియో విడుదల చేసిన ఆయన... పేదవాడి ఇంటి వరకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న సదుద్దేశంతోనే... జిల్లాకో ఆసుపత్రి, మెడికల్ కాలేజీ స్థాపించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ 17 మెడికల్ కాలేజీలు స్థాపనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అయితే అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని తుంగలో తొక్కి.. తిరిగి ప్రైవైటీకరణకు అనుకూలంగా సంతకం చేశారంటూ వైయస్ఆర్‌సీపీ పై దుష్ప్రచారం చేయడంపై గురుమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ లో ఏడాది ఫీజు రూ.1350 ఉండే, ప్రైవేటు కాలేజీల్లో రూ. 1.50 కోట్లు వరకు వసూలు చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ నివేదికలో పొందుపరిచిన విషయం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. వేదిక ఏదైనా వైయస్ఆర్‌సీపీదీ ఎప్పడూ ప్రజాపక్షమే అని తేల్చి చెప్పిన ఆయన... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం.. తన విధానం మార్చుకొని, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Latest News