|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:22 PM
గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ దళంలో భాగస్వామి అయ్యేందుకు పాకిస్థాన్ సుముఖత వ్యక్తం చేయడంపై అమెరికా కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నందుకు పాకిస్థాన్‌కు ఎంతో రుణపడి ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలతో చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపారు. "ఈ దళంలో చేరాలనుకుంటున్న దేశాలు, వాటి విధివిధానాలు, నిధుల సమీకరణ, అధికార పరిధి వంటి అంశాలపై స్పష్టత కోరుతున్నాయి. ఈ విషయాలపై మేము వారికి పూర్తి వివరాలు అందించాల్సి ఉంది" అని రూబియో వివరించారు.అవసరమైన స్పష్టతనిస్తే, ఈ ఘర్షణలో భాగం కాని అనేక దేశాలు స్థిరీకరణ దళంలో చేరడానికి ముందుకు వస్తాయన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. "ఒకవేళ పాకిస్థాన్ అంగీకరిస్తే అది చాలా కీలకం అవుతుంది. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు వారికి మరిన్ని సమాధానాలు ఇవ్వాలి" అని ఆయన అన్నారు.
Latest News