|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:28 PM
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో సరదాగా, స్ఫూర్తిదాయకంగా గడిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘హలో లోకేశ్’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు వ్యక్తిగత, రాజకీయ, సామాజిక ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా, ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఎన్.శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఓ విద్యార్థిని, "మీ అమ్మగారు మిమ్మల్ని మొదటిసారి ఎప్పుడు, ఎందుకు కొట్టారు?" అని అడిగిన ప్రశ్నకు లోకేశ్ నవ్వుతూ స్పందించారు. "మా అమ్మ ఇప్పటికీ రెండు దెబ్బలు కొడతారు. తల్లికి చెప్పలేని ఏ పనీ చేయకూడదని చాగంటి గారు చెప్పారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మగారే. ఆమె నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అనేది షరతులు లేనిది. ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలి" అని ఆయన ఉద్వేగంగా చెప్పారు. ఇక, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని మరో విద్యార్థి ప్రశ్నించగా... తన భార్య బ్రహ్మణి తన మొదటి, చివరి క్రష్ అని తెలిపారు. తనను కాలేజీలో ఎవరూ ర్యాగింగ్ చేయలేదని, అందరితో స్నేహంగా ఉండేవాడినని స్పష్టం చేశారు.రాజకీయాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ, "2004-05 సమయంలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారికి ప్రజల నుంచి లభించే గౌరవాన్ని చూసి స్ఫూర్తి పొందాను. ఆయనకు దక్కిన గౌరవం నాకూ దక్కాలని అహర్నిశలు కష్టపడుతున్నాను" అని లోకేశ్ తెలిపారు.
Latest News