|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:23 PM
అమెరికాలో విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని బయటపెట్టిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్ కుంభకోణం సంచలనంగా మారింది. తన పలుకుబడి పెంచుకోడానికి దేశాధినేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలకు 18 ఏళ్లలోపు టీనేజ్ అమ్మాయిల్ని ఎరగా వేసి మానవ అక్రమ రవాణానికి పాల్పడిన ఎపిస్టీన్.. 2019లో జైల్లో ఉండగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతుడు చనిపోయి ఆరేళ్లయినా.. ఈ కేసు ప్రకంపనలు మాత్రం ఆగలేదు. తాజాగా, ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ ఫైల్స్‌ను విడుదల చేసింది. దీనికి ముందు అమెరికా ప్రతినిధుల సభలో ఇటీవల డెమొక్రాట్లు పలువురు ప్రముఖులు ఎపిస్టీన్ ఎస్టేట్‌లో దిగిన ఫోటోలను బయటపెట్టిన విషయం తెలిసిందే.
అయితే, న్యాయ శాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో కొన్ని అదృశ్యమైనట్టు ప్రతిపక్ష డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను డిలీట్ చేశారని ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఓ మహిళతో ట్రంప్ ఉన్న ఆ ఫోటోకు 468 అనే నెంబరు ఉండేదని, కనీసం 16 ఫైల్స్ న్యాయశాఖ వెబ్‌పేజీ నుంచి ఎటువంటి ఆమోదయోగ్యమైన వివరణ లేకుండా అదృశ్యమైనట్టు చెబుతున్నారు. ఈ మేరకు హౌస్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమొక్రాట్లు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
‘‘డొనాల్డ్ ట్రంప్ ఉన్న ఎపిస్టీన్ ఫైల్స్‌లోని ఈ ఫోటో ఫైల్ 468, ప్రస్తుతం న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ నుంచి దానిని తొలగించింది’’ అని పేర్కొన్నారు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్‌ను కమిటీ ప్రశ్నించింది. ‘(అటార్నీ జనరల్ పామ్ బాండి) ఇది నిజమేనా? ఇంకా ఏ విషయాలు దాచిపెట్టారు? అమెరికా ప్రజల కోసం మాకు పారదర్శకత అవసరం.. ’అని నిలదీసింది.
మరోవైపు, నిరంతరం ఒత్తిడి, పారదర్శకతను కోరుతూ కాంగ్రెస్ జారీచేసిన ఉత్తర్వుల అనంతరం ఎపిస్టీన్ ఫైల్స్‌ను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఫైళ్లలో ఫోటోలు, మెయిల్స్, ఆడియో రికార్డింగ్‌లు, ఏళ్లుగా పరిశీలనలో సేకరించిన దర్యాప్తు సామగ్రి ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక రోజులోనే 16 ఫైల్స్ అదృశ్యమయ్యాయి. ఇందులో ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఎపిస్టీన్, అతడి సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్‌తో దిగిన ఫోటో కూడా ఉంది.
ఎపిస్టీన్ ఫైల్స్‌లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహా అమెరికా వాణిజ్య శాఖ మాజీ మంత్రి ల్యారీ సమ్మర్స్, అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, అమెరికాలో యూకే మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరార్, న్యూమెక్సికో గవర్నర్ బిల్ రిచర్డ్‌సన్, అమెరికా సెనేట్ నేత జార్జ్ మిచెల్, ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, రైడ్ హఫ్‌మన్, పీటర్ థెయిల్ తదితరులు ఉన్నారు.