|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:54 PM
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన జవాన్లు, మీనాగట్ట అడవుల్లో భూమిలో పాతిపెట్టిన పేలుడు పదార్థాలను మరియు ఆయుధాలను వెలికితీశారు.సరిహద్దు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని, ప్రదేశంలో మావోయిస్టులు నిల్వ చేసిన భారీ ఆయుధ గిడ్డంగిని గుర్తించారు. ఆయుధ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న వాటిలో భారీ ఎత్తున ఐఈడీ పేలుడు పదార్థాలు, వైర్లు, డిటోనేటర్లు, మందుగుండు సామాగ్రి మరియు కొన్ని దేశవాళీ తుపాకులు ఉన్నాయి. వీటితో పాటు మావోయిస్టులకు సంబంధించిన యూనిఫామ్‌లు, కిట్ బ్యాగులు మరియు విప్లవ సాహిత్యాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Latest News