|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:11 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన వ్యక్తిగత హక్కులు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిగింది. తన అనుమతి లేకుండా తన పేరు, చిత్రం, గొంతు, ఇంకా వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా నిరోధించాలని పవన్ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది జె. సాయి దీపక్ వాదనలు వినిపించారు.సోషల్ మీడియా వేదికలు, ఈ-కామర్స్ సైట్లు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో తన ప్రతిష్టను దిగజార్చేలా లేదా తన అనుమతి లేకుండా తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కీలక రాజ్యాంగ పదవిలో ఉన్నందున, తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లడం వల్ల తన ప్రజా జీవితంపై ప్రభావం పడుతుందని పవన్ కళ్యాణ్ తన పిటిషన్ లో కోర్టుకు వివరించారు.దీంతో.. 2021 ఐటీ నిబంధనల ప్రకారం, అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు సంబంధిత సంస్థలను ఆదేశించింది. పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ, సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఆయన ఇమేజ్‌ను వాడుతున్న లింకులను తొలగించాలని కూడా కోర్టు సూచించినట్లు సమాచారం.
Latest News