|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 08:39 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఒక గూడ్స్ రైలు లోకో పైలట్ చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సిగరెట్ల కోసం రైలును.. రైల్వే క్రాసింగ్ వద్ద 10 నిమిషాల పాటు ఆపేశాడు. గూడ్స్ రైలు రావడంతో అక్కడ లెవల్ క్రాసింగ్ మూసివేశారు. రైలు నేరుగా వెళ్లకుండా సిగరెట్ల కోసం ఆపేయడంతో.. రోడ్డుపైన నిలిచిపోయిన వాహనదారులు అవస్థలు పడ్డారు. ఇలా పట్టాలపై గూడ్స్ రైలును ఆపేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
రాయ్‌బరేలీ జిల్లాలోని మల్కన్ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే లెవల్ క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలును 10 నిమిషాలు ఆపడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా రైళ్లు సిగ్నల్ పడక, సాంకేతిక కారణాల వల్ల రైళ్లు ఆగడం చూస్తుంటాం. కానీ ఈ ఘటనలో మాత్రం.. రైలు పరుగులు తీస్తుండగానే లోకో పైలట్ రైలు దిగి పట్టాలు దాటి వెళ్లిన వీడియో వైరల్ కావడం గమనార్హం. అక్కడ ఉన్న ఒక కిరాణా దుకాణంలో సిగరెట్లు కొనడానికే ఆ లోకో పైలట్ వెళ్లినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఆ రైలు ఎన్టీపీసీ ప్రాజెక్టుకు బొగ్గును అన్ లోడ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 10 నిమిషాల పాటు రైలు పట్టాలకు అడ్డంగా ఆపేసి.. కదలకపోవడంతో రైల్వే గేటు రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో.. గూడ్స్ రైలు రోడ్డును బ్లాక్ చేస్తూ నిలబడి ఉండటం.. లోకో పైలట్ నిదానంగా రైలు ఎక్కడం గమనార్హం. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రాసింగ్ వద్ద ఇలా రైళ్లను ఆపడం తరచుగా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్ల అత్యవసర పనుల మీద వెళ్లే వారు.. అంబులెన్సులు ఇబ్బంది పడుతున్నాయని వాహనదారులు విమర్శిస్తున్నారు.
ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఆధారంగా అసలు రైలు ఎందుకు ఆగింది.. లోకో పైలట్ అనుమతి లేకుండానే రైలు దిగి వెళ్లాడా.. అనే కోణంలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టి రిపోర్ట్ అందిన తర్వాత.. సదరు లోకో పైలట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
Latest News