|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:31 PM
టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వేధింపులు తాళలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన వీడియో ఘటన పల్నాడు జిల్లా అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతోంది. నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ దళిత ఎస్సీ కార్యకర్త మేకల చిన్న గోపి అలియాస్ చిన్ని గత ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున కీలకంగా పనిచేశారు. వైయస్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న గోపి, పార్టీ కోసం గ్రామ స్థాయిలో బలమైన పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అతని అనుచరులు గోపిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి రాకుండా బెదిరింపులు, నిరంతర వేధింపులకు గురిచేశారని తెలిపారు. రాజకీయ విభేదాల కారణంగా అతడిని మానసికంగా హింసించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నెల 21వ తేదీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన గోపిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి, చివరకు ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆత్మహత్యకు ముందు గోపి ఓ సూసైడ్ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశాడు. అందులో తన మృతికి టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అతని అనుచరులే కారణమని స్పష్టంగా పేర్కొన్నాడు. అలాగే, “వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయనే నా కుటుంబానికి న్యాయం చేస్తారు” అంటూ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశాడు.
Latest News