|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:47 PM
హెచ్-1బీ, హెచ్-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రామాణిక వీసా స్క్రీనింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలన (వెట్టింగ్)ను అన్ని హెచ్-1బీ, హెచ్-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఈ నెల 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, దీంతో ఈ వీసా కేటగిరీలకు సంబంధించి అదనపు ప్రాసెసింగ్ సమయం పట్టే అవకాశముందని ఎంబసీ తెలిపింది. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే భారత్‌లో ఈ నెలాఖరులో జరగాల్సిన వేలాది హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా పలు నెలల పాటు వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.అమెరికా టెక్నాలజీ కంపెనీలు విస్తృతంగా వినియోగించే హెచ్-1బీ వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే హెచ్-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు. అత్యుత్తమ విదేశీ ప్రతిభను నియమించుకునే అవకాశాన్ని కొనసాగిస్తూనే, అక్రమాలు జరగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఎంబసీ వివరించింది.కొత్త వెట్టింగ్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు భారీగా రద్దు అయ్యాయి. ఈ నెల 15న ఇంటర్వ్యూ ఉన్న వారికి మార్చిలో కొత్త తేదీలు ఇవ్వగా, 19న అపాయింట్‌మెంట్ ఉన్నవారికి మే చివరి వరకు వాయిదా వేశారు. దీంతో ఇప్పటికే భారత్‌కు వచ్చిన అనేక మంది ఉద్యోగులు వీసా లేక అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
Latest News