|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:28 PM
మెక్సికోలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉన్నఫళంగా ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు. మెక్సికో సిటీ, శాన్ మార్కోస్ లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం అకపుల్కో నగరంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు ఇద్దరు మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు.స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు భూకంపం మెక్సికో సిటీని వణికించింది. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్ బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ ను వెంటనే బయటకు తరలించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లల్లోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించింది.
Latest News