|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:15 PM
వాడుకునే ఆలోచన ఉండాలే కానీ.. ఈ లోకంలో ప్రతీ వస్తువు ఉపయోగకరమైనదే. వివిధ రకాలుగా వినియోగించదగినదే. ఉదాహరణకు సెల్ టవర్లనే తీసుకోండి. సాధారణంగా సెల్‌టవర్లు ఎందుకు ఉపయోగపడతాయని అనుకుంటారు.. మారుమూల ప్రాంతాల వారికి కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందించేందుకు ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే. అందుకే ఏజెన్సీ ప్రాంతాలకు కూడా సెల్ సంకేతాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెల్ టవర్లు ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే సెల్ టవర్లు.. ఫోన్ సిగ్నళ్లను మాత్రమే కాకుండా సెక్యూరిటీని (భద్రత) కూడా అందిస్తాయని తెలుసా.. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ఈ రకమైన వినూత్న ఆలోచన చేశారు.
అల్లూరి జిల్లాలోని మన్యం ప్రాంతం.. చాలా సున్నితమైన ప్రాంతం. శాంతి భద్రతల పరంగానూ పోలీసులకు అత్యంత కీలకమైన ప్రాంతం. దీంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, నిఘా విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అనేక ఆధునిక యంత్ర పరికరాలను సైతంఈ ప్రాంతంలో వినియోగిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలను ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య మావోయిస్టుల కదలికలు, గంజాయి సాగు, అక్రమ రవాణా. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు మన్యం ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. వీటికి అదనంగా మరో ముఖ్యమైన ఆలోచన కూడా చేశారు.
సాధారణంగా సీసీ కెమెరాలను ట్రాఫిక్ నియంత్రణకు వాడుతుంటారు. ఇందులో భాగంగా రద్దీగా ఉండే కూడళ్లు, జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అయితే అల్లూరి జిల్లా పోలీసులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
అల్లూరి జిల్లాలో1,560 సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సెల్ టవర్లను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ సెల్ టవర్లను సీసీ కెమెరాలను అమర్చడం ద్వారా ఆయా గ్రామాలలో కదలికలపై పర్యవేక్షణ ఉంచుతున్నారు. దీంతో ఈ గ్రామాలకు సెల్ టవర్లను సెల్ ఫోన్ సిగ్నళ్లను అందించడం మాత్రమే కాకుండా సెక్యూరిటీగా కూడా ఉంటున్నాయి.
Latest News