|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:24 PM
చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ స్కీం ఆపించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొందన్న ఆయన.. ఇంత జరుగుతున్నా ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్న శ్రీకాంత్ రెడ్డి.. 1995లో బాబు హయాంలోనే ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మించగా... తాజాగా మరలా రూ.70వేల కోట్లతో కర్ణాటక ఆల్మట్టి విస్తరణ చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాయలసీమకు జీవనాడి పోతిరెడ్డిపాడు లిఫ్ట్ అని.. అయితే శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు సాధ్యమన్న ఆయన.. ఎగువ రాష్ట్రాల వల్ల అది ఎప్పుడూ సాధ్యం కావడం లేదని తేల్చి చెప్పారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులు వైయస్సార్ కుటుంబం చలువే అని తేల్చి చెప్పారు. వైయస్సార్ హయాంలో హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు రూపకల్పన చేసుకోగా... బ్రహ్మంసాగర్, అవుకు, చిత్రావతి, వామికొండ ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు గండికోటలో 27 టీఎంసీలు పుల్ లెవల్ నింపిన ఘనత కూడా వైయస్.జగన్ దేనని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం రూ.3600 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, రూ.900 కోట్లు ఖర్చు పెడితే.. అలాంటి ప్రాజెక్టు వృధా అనడం దారుణమని మండిపడ్డారు. రాయలసీమ పొట్ట కొట్టే ప్రయత్నం చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Latest News