|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:45 PM
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇళ్ల పంపిణీకి ముహూర్తం దాదాపుగా ఖరారు చేసింది. ఇల్లు లేని వారి కోం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఐదు లక్షల ఇళ్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇళ్ల నిర్మాణాలపై శనివారం రోజున సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేపట్టేలా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టేలా, వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉగాది నాటికి గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం రోజువారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని.. అధికారులు కూడా తనిఖీలు చేసి నాణ్యతతో త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఇక పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే లేఅవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని.. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయిన ప్రాంతాలలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పార్థసారథి అధికారులకు సూచించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్ యోజన తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. పీఎం ఆవాస్ యోజన - ఎన్టీఆర్ పథకం పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక ఇటీవలే కొత్త ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో రూ.1.59 లక్షలు ప్రభుత్వం అందిస్తోంది. అలాగే పట్టణాలలో ఇల్లు నిర్మించుకునేవారికి రూ.2.50 లక్షలు చొప్పున సాయం అందిస్తోంది. దరఖాస్తుల గడువు ఇటీవలే పూర్తి కాగా.. త్వరలోనే అర్హుల జాబితా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టనున్నారు.
Latest News