|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:59 AM
కేసుల్లో అరెస్టై 83 రోజుల పాటు జైలులో నిర్బంధానికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ను వైయస్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.అంబటి రాంబాబు మాట్లాడుతూ..జోగి రమేష్‌ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్‌పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు. అన్యాయ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత జోగి రమేష్‌పై ప్రజల్లో మరింత ఆదరణ, క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను వాడుకుంటూ వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇది అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని, కేసులు పెడితే వైయస్ఆర్‌సీపీ నేతలు భయపడిపోతారని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబు ఎంత హింసిస్తే, అంతే పట్టుదలతో వైయస్ఆర్‌సీపీ బలోపేతానికి తాము సిద్ధపడతామని స్పష్టం చేశారు. జోగి రమేష్ భార్య, కొడుకులు, తమ్ముడు సహా కుటుంబ సభ్యులందరిపై కేసులు పెట్టి కుటుంబాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ అణచివేతలన్నీ చరిత్రలో లిఖించబడతాయని, రాబోయే రోజుల్లో వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార మదంతో వ్యవహరిస్తే కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. బెయిల్ తెచ్చుకున్న వెంటనే మరో తప్పుడు కేసు పెడతారని తాను ముందే చెప్పానని, చెప్పినట్టుగానే మరో కేసు పెట్టారని తెలిపారు. చంద్రబాబు జోగి రమేష్‌ను అరెస్టు చేయించి మరింత శక్తివంతుడిని చేశారని, అరెస్టులు, జైళ్లు వైయస్ఆర్‌సీపీ నేతలను ఏమీ చేయలేవని అన్నారు.
Latest News