|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:14 PM
రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో సీమ ప్రజలకు ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే సీమకు సాగు, త్రాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనంతరం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీరు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం నీటిని తరలిస్తుండటాన్ని అరికట్టేందుకే ఈ పథకం అవసరమైందని స్పష్టం చేశారు. సీమ ప్రజలకు అందాల్సిన 22 టీఎంసీల నీటిని అడ్డుకునేలా తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతుందని హెచ్చరించారు. సీమకు న్యాయం జరగాలంటే ఈ పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద జరిగే నిరసన సభకు గ్రేటర్ రాయలసీమ ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కాటసాని పిలుపునిచ్చారు.
Latest News