|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:27 PM
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని, సీబీఐ ఛార్జిషీట్ ద్వారా ఈ విషయం వెల్లడైందని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా ఈ విషయం తేట తెల్లమైందన్న ఆయన... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన బాబు.. అది తప్పని తెలిసినా క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పైగా సిట్ నివేదికతో తనను తాను సమర్థించుకోలేని సీఎం.. మరింత దిగజారి లడ్డూపై మరలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఈ నేపధ్యంలో బాబును ప్రజా క్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. గతంలో చంద్రబాబు బోలే బాబా డెయిరీని ప్రోత్సహిస్తే... వైయస్ఆర్‌సీపీ హయాంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టిందని... తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆనందపడాల్సింది పోయి.. మరలా విష ప్రచారానికి తెర లేపడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్లను రాక్షస తెగ అనడంలో తప్పులేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నోరెత్తకపోయినా.. మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.తన వ్యాఖ్యలకు కట్టుబడిలేకపోతే... చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Latest News