సునేత్రా పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి....స్పందించిన శరద్ పవార్
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:23 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బుధవారం రోజు జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకాల మరణం చెందగా.. ఆయన రాజకీయ వారసురాలిగా సతీమణి సునేత్రా పవార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఈ నియామకంపై అజిత్ పవార్ బాబాయ్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శనివారం సాయంత్రం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి తనకు అసలు సమాచారమే లేదని, మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని ఆయన వెల్లడించడం సంచలనంగా మారింది.


రాజకీయాలకు, కుటుంబానికి స్పష్టమైన రేఖ


అజిత్ పవార్ వారసురాలి ఎంపిక ప్రక్రియలో మిమ్మల్ని పక్కన పెట్టారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. "నాకు తెలియదు" అని శరద్ పవార్ పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. బారామతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారానికి పవార్ కుటుంబం నుంచి ఎవరైనా హాజరవుతారా అనే అంశంపై కూడా తనకు స్పష్టత లేదని చెప్పారు. 2023లో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పటి నుంచి బాబాయ్, అబ్బాయిల మధ్య రాజకీయ దూరం కొనసాగుతోంది.


అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలోని రెండు వర్గాల విలీనంపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు విషాదకరంగా మారాయి. నిజానికి అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌కు డిసెంబర్ 12వ తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'పార్టీ విలీనం' అనే బహుమతి ఇవ్వాలని భావించినట్లు ఎన్సీపీ (ఎస్పీ) నేత అంకుష్ కాకడే వెల్లడించారు. "సాహెబ్ (శరద్ పవార్) తో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు వర్గాలు ఏకమయ్యేలా మాట్లాడండి" అని అజిత్ పవార్ తమను కోరినట్లు కాకడే గుర్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 12న ఈ విలీనాన్ని అధికారికంగా ప్రకటించాలని కూడా నిర్ణయించుకున్నారనే వార్తలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి.


జనవరి 17న జరిగిన ఆ చివరి భేటీ..


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ పునరేకీకరణపై చర్చించేందుకు జనవరి 17వ తేదీన శరద్ పవార్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ కలిసి పని చేయాలని ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చారని, కానీ విధి ఆడిన వింత నాటకంలో అజిత్ పవార్ అకాల మరణం చెందడంతో ఆ కోరిక నెరవేరకుండానే పోయింది. ఇప్పుడు విలీనంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత జయంత్ పాటిల్‌పై ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు.


ఆ విషాద విమాన ప్రమాదం..


బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి ప్రయాణిస్తున్న సమయంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న 'లియర్ జెట్ 45' విమానంరెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్ సుమిత్ కపూర్, కో-పైలట్ శాంభవి పాఠక్, వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించడమే కాకుండా పవార్ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది.

Latest News
Theegala seals second straight Top-10 finish at Farmers Insurance Open Mon, Feb 02, 2026, 05:02 PM
IMF lowers Pakistan's GDP growth forecast to 3 per cent Mon, Feb 02, 2026, 05:01 PM
Karnataka government should deal with issue of illegal Bangladeshis in state with an iron hand: Ashoka Mon, Feb 02, 2026, 04:59 PM
Budget sustains reform momentum through people-centric approach: KPMG in India CEO Mon, Feb 02, 2026, 04:48 PM
CBI raids 35 global cybercrime hotspots in 9 states, arrests key operative Mon, Feb 02, 2026, 04:46 PM