|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:27 PM
చిన్న చిన్న పనులు చేస్తూ.. భారీగా డబ్బులు సంపాదించే బిజినెస్‌లు చాలా ఉంటాయి. టీ, పాన్ షాప్, టిఫిన్ సెంటర్, పానీపూరీ బండి పెట్టుకుని.. చాలా మంది స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తూ.. చాలా ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని.. క్యాబ్‌లలో ఆఫీసుకు వెళ్లి.. పెద్ద పెద్ద అద్దాల మేడల్లో, ఏసీ రూమ్‌లలో కూర్చొని నెలంతా కంప్యూటర్ ముందు కష్టపడితే తిప్పికొట్టినా రూ.20 వేలు రాని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎంతో మంది ఉంటారు. కానీ ఒక వ్యక్తి.. ఒకే రోజులో ఏకంగా రూ.21 వేలు సంపాదించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా మ్యాగీ విక్రయించి.. అంత డబ్బు సంపాదించానని ఓ కంటెంట్ క్రియేటర్ వీడియో చేయడం.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
బాదల్ ఠాకూర్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన ఒక ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పర్వత ప్రాంతాలు చూసేందుకు వచ్చే టూరిస్ట్‌లకు ఒక రోజు మొత్తం మ్యాగీ చేసి అమ్మడం ద్వారా భారీగా ఆదాయం పొందవచ్చని ఆయన ప్రపంచానికి నిరూపించాడు. కష్టపడి కొండ ప్రాంతాలకు వచ్చే టూరిస్ట్‌లకు సరదాగానో లేక ఆకలిగా ఉన్నప్పుడో ఏదో ఒక స్నాక్ అందిస్తే.. దాని వల్ల భారీగా సంపాదించవచ్చని అతడు గ్రహించాడు. దీంతో అక్కడ మ్యాగీ చేయడం ప్రారంభించాడు.
నార్మల్ మ్యాగీని ఒక ప్లేట్‌కు రూ.70 చొప్పున.. చీజ్ మ్యాగీని ప్లేట్ రూ.100 చొప్పున విక్రయించాడు. ఒక రోజులో సుమారు 300 నుంచి 350 ప్లేట్లు అమ్మాడు. దీంతో ఆ రోజులో మొత్తం వసూళ్లు సుమారు రూ.21 వేలు వచ్చినట్లు బాదల్ ఠాకూర్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దానికి 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో కింద నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ లెక్కన నెలకు రూ.6 లక్షల వరకు సంపాదించవచ్చని లెక్కలు వేస్తున్న నెటిజన్లు.. ఇప్పుడు తాము చేస్తున్న ఉద్యోగం మానేసి మ్యాగీ దుకాణం పెట్టుకోవాలా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. చల్లని కొండ ప్రాంతాల్లో వేడివేడి మ్యాగీ అంటే పర్యాటకులు బాగా ఎగబడతారని.. అదే ఈ అమ్మకాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
అయితే.. రూ.21 వేల ఆదాయం ఒకే రోజులో రాగా.. అందులో నికర లాభం తక్కువగా ఉంటుందని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు. మ్యాగీ ప్యాకెట్లు, గ్యాస్ సిలిండర్, నీరు, ప్లేట్లు.. వాటిని కొండపైనికి తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చు.. -10 డిగ్రీల చలిలో రోజంతా నిలబడి పని చేయడం.. అతనికి సహాయం చేసే అసిస్టెంట్లకు ఇచ్చే ఖర్చులు అన్నీ కలిపి తీసేస్తే రోజుకు సుమారు రూ.8 వేల వరకు లాభం ఉండవచ్చని ఒక నెటిజన్ లెక్క కట్టారు. ఇది కూడా చాలా మంచి ఆదాయమే అయినప్పటికీ.. పర్వత ప్రాంతాల్లో నిత్యం రోజంతా అలా పని చేయడం చాలా కష్టమని పేర్కొంటున్నారు.
Latest News