|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 07:55 PM
మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకం అంశం భయపడటం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభకు రావట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తల్లో నిజం లేదని, ఎవరైనా మోదీని బెదిరిస్తే వారిపై FIR నమోదు చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో భయపడుతున్న ప్రభుత్వం, బడ్జెట్‌లో చర్చకు వణుకుతోందని ఆయన విమర్శించారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకం పట్ల మోదీకి భయం ఉందని, తమ వద్ద ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు.‘‘నేను ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాల గురించి మాట్లాడటం లేదు. ఒక మ్యాగజైన్‌ను ఉటంకిస్తూ, అందులోని కొన్ని అంశాలను లోక్‌సభకు చెప్పదలిచాను. నేనొక పుస్తకం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అని మోదీ సర్కారు చేస్తున్న ఆరోపణ సరికాదు. ఎంఎం నరవణె పుస్తకం పబ్లిషే కాలేదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారు. ఆయన చెప్పింది తప్పు. ఆ బుక్ పబ్లిష్ అయింది. మేం ఒక కాపీని కూడా సేకరించాం. అందుకే ఇదొక పెద్ద అంశం’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో లోక్‌సభ విపక్ష నేతగా ఉన్న నన్ను, మొత్తం విపక్షాలను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. అధికార ఎన్‌డీఏ కూటమిలోని ఒక ఎంపీ చాలా పుస్తకాలను ఉటంకిస్తూ లోక్‌సభలో మాట్లాడాడు. నీచమైన వ్యాఖ్యలు చదివి వినిపించాడు. అయినా ఆయనను స్పీకర్ ఏమీ అనలేదు. ఇది రెండో పెద్ద అంశం. అధికార పక్షం ఎంపీలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మేం ఏమీ మాట్లాడొద్దు అంటే ఎలా?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Latest News