|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:27 PM
అగ్రరాజ్యం అమెరికాతో బంగ్లాదేశ్ జరిపిన తాజా వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం రోజు ఉభయ దేశాల మధ్య పరస్పర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పెట్టుకున్నారు. దీని ప్రకారం బంగ్లాదేశ్ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలు 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గనున్నాయి. అయితే ఈ 1 శాతం తగ్గింపు బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో లేదనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పొరుగున ఉన్న భారత దేశానికి అమెరికా 18 శాతం టారిఫ్‌ను ఖరారు చేయడంతో.. వస్త్ర రంగమే వెన్నెముకగా ఉన్న బంగ్లాదేశ్‌లో ఆందోళన మొదలైంది.
ఏమిటీ ఒప్పందం? దీని వెనుక ఉన్న షరతులు ఏంటి?
అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్, బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ ఈ చారిత్రక పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వెనుక బంగ్లాదేశ్ కొన్ని భారీ త్యాగాలకు సిద్ధపడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ తయారు చేసే దుస్తుల్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కాటన్ లేదా సింథటిక్ ఫైబర్‌ను ఉపయోగిస్తే.. అలాంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో సున్నా సుంకం సదుపాయం కల్పిస్తారు. బదులుగా బంగ్లాదేశ్ తన దేశీయ మార్కెట్‌ను అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు (రసాయనాలు, వైద్య పరికరాలు, ఆటో పార్టులు, సోయాబీన్, ఇంధన ఉత్పత్తులు) పూర్తిగా తెరిచేందుకు అంగీకరించింది. అది మాత్రమే కాకుండా విమానయాన రంగంలోనూ అమెరికాకు ప్రాధాన్యతనిస్తూ.. 'బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్' కోసం 14 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.
భారత్‌తో పోటీ.. బంగ్లాదేశ్‌కు ఎందుకు కంగారు?
ప్రస్తుతం అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లో భారత్, బంగ్లాదేశ్, వియత్నాం ప్రధాన పోటీదారులు. ఇటీవలే భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంతో.. భారత్‌పై అమెరికా పెద్ద ఎత్తున సుంకాన్ని తగ్గించింది. ముఖ్యంగా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీని వల్ల అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్త్రాలు బంగ్లాదేశ్ వస్త్రాల కంటే చౌకగా లభిస్తాయి. ఈ పోటీని తట్టుకునేందుకే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎన్నికల వేళ తీవ్ర ఒత్తిడికి లోనై.. అమెరికా విధించిన కఠిన షరతులకు తలొగ్గినట్లు తెలుస్తోంది.
అయితే ఇంత చేసినా బంగ్లాదేశ్‌కు ఆశించిన స్థాయిలో ఫలం దక్కకపోవడంతో.. కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 19 శాతం టారిఫ్‌తోనే బంగ్లాదేశ్ సర్దిపుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే అమెరికా కాటన్ వాడితే లభించే 'జీరో టారిఫ్' వెసులుబాటును బంగ్లాదేశ్ ఏ మేరకు అందిపుచ్చుకుంటుందో చూడాలి మరి.
Latest News