|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:48 AM
తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తన అసమర్థత బయట పడకుండా ఏడాదిన్నరగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నాడని, శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడటం సిగ్గచేటన్నారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంకర్లు దొడ్డి దారిన ఎలా ప్రవేశించాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి లభించిందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
Latest News