|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:55 PM
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై జడ్జి జస్టిస్ జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అప్పటి వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అప్రూవర్‌గా మార్చిన విషయాన్ని కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. కేవలం అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ కేసులో 18వ నిందితుడిగా ఎందుకు చేర్చాల్సి వచ్చిందని న్యాయమూర్తి సీబీఐని ప్రశ్నించారు. మాగుంట స్టేట్‌మెంట్‌కు ఉన్న విశ్వసనీయతపై న్యాయస్థానం ఈ సందర్భంగా కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన ప్రకటనలే కేజ్రీవాల్‌ను నిందితుల జాబితాలోకి చేర్చడానికి ప్రధాన కారణమని కోర్టు గుర్తించింది. ఒక వ్యక్తిని అప్రూవర్‌గా మార్చి, వారి మాటల ఆధారంగానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కేసులో ఇరికించడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం అప్రూవర్ల మాటలను మాత్రమే ఆధారంగా తీసుకుంటే కేసు పటిష్టత దెబ్బతినే అవకాశం ఉంటుందని, ఇతర శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయని సీబీఐ అధికారులను కోర్టు నిలదీసింది.
లిక్కర్ పాలసీ మార్పుల వెనుక నిర్దిష్ట వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యం ఉందన్న సీబీఐ వాదనను కూడా కోర్టు విశ్లేషించింది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకే కేజ్రీవాల్ ప్రభుత్వం పాలసీని సవరించిందని నిరూపించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మాగుంట వంటి వారిని సాక్షులుగా వాడుకుని, కేజ్రీవాల్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు దర్యాప్తు సంస్థ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.
మొత్తానికి ఢిల్లీ మద్యం స్కామ్ విచారణలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు రావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారినప్పటికీ, పాత కేసులోని సాక్ష్యాలు ఇప్పుడు దేశ రాజధాని రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అప్రూవర్ల సాక్ష్యాల ఆధారంగా సాగుతున్న ఈ కేసు విచారణ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.