|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:35 PM
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నియంత కిమ్ తర్వాత పాలనా బాధ్యతలను ఆయన కూతురు జూ యే చేపడతారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలకు కిమ్ తన వెంట కూతురును కూడా తీసుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన వారసురాలిగా తీర్చిదిద్దేందుకు జూ యే కు కిమ్ శిక్షణనిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఓ ఫొటో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. జూ యే తన తండ్రి కిమ్ అడుగుజాడల్లో నడుస్తూ, ప్రొఫెషనల్ షూటర్ లాగా జూ యే రైఫిల్ పట్టుకుని గురిచూస్తున్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ శనివారం ఈ ఫొటోలను విడుదల చేసింది. అందులో జూ యే ఒక అవుట్‌డోర్ షూటింగ్ రేంజ్‌లో, స్కోప్ ద్వారా గురి చూస్తూ తుపాకీని పేలుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తుపాకీ గొట్టం నుంచి పొగ వస్తున్నట్లు ఉన్న ఈ ఫొటోలు ఆమెకు ఆయుధాల వాడకంలో శిక్షణనిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. విశేషమేమిటంటే, కిమ్ జోంగ్ ఉన్ తరచుగా ధరించే లెదర్ జాకెట్‌నే జూ యే కూడా ధరించింది. ఇది ఆ దేశంలో అధికారం మరియు వారసత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.
Latest News