by Suryaa Desk | Sun, Sep 22, 2024, 07:37 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతీయ సినీ చరిత్రలో ఒక అపురూపమైన నటుడు అని గుర్తిస్తూ ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సముచిత స్థానం కల్పించింది. తన సుదీర్ఘ సినీ కెరీర్ లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు నమోదైంది. ఇవాళ హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖులు, మెగా కుటుంబ సభ్యులు, ఇతర రంగాలకు చెందినవారు హాజరయ్యారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్న చిరంజీవి... అనంతరం మాట్లాడుతూ, నేను ఎదురు చూడని గొప్ప గౌరవం ఇది అని అభివర్ణించారు. నటన మీద కన్నా డాన్స్ మీద నాకున్న ఇష్టమే ఈ గిన్నిస్ అవార్డు రావడానికి కారణం అనుకుంటా అని వివరించారు. "చిన్నప్పటి నుంచి నేను డాన్స్ లు చేయడం అనేది నాకు ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ అయ్యింది. కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డాన్స్ లకు ప్రత్యేకత వచ్చింది. నటనకు అవార్డ్స్ వస్తాయి... కానీ ఈ రకంగా నా డాన్స్ లకు కూడా రికార్డు, అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయంలో నా దర్శకనిర్మాతలు అభిమానుల పాత్ర మరువలేనిది" అని వివరించారు.
Latest News