by Suryaa Desk | Tue, Nov 19, 2024, 04:35 PM
షారుక్ ఖాన్.. ఇండియాలోనే కాదు ప్రపంచమే మెచ్చి నటుల్లో ఒకరు. బాలీవుడ్ లో అతని జర్నీ సాధారణ విషయం కాదు. అలాంటి వ్యక్తి కూడా తాను ఇప్పటికీ బాత్ రూమ్ లోకి వెళ్లి చాలా ఏడుస్తానని చెప్పాడు.దుబాయ్ గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ లో పాల్గొన్న షారుక్.. ఈ సందర్భంగా తన జీవితం, ఇండస్ట్రీ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు, స్టార్‌డమ్ వరకూ సాగించిన ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. కానీ అలాంటి నటుడికి కూడా కెరీర్ మొదట్లో సవాళ్లు తప్పలేదు. బాలీవుడ్ లో తాను సాగించిన ప్రయాణం గురించి తాజాగా దుబాయ్ గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ లో కింగ్ ఖాన్ చెప్పాడు. తన కెరీర్ ను తాను విమర్శనాత్మక ధోరణిలో చూస్తారా అని అడిగినప్పుడు అవును అని అతడు అన్నాడు.
"అవును. ఆ ఫీలింగే నాకు చెత్తగా అనిపిస్తుంది. బాత్రూమ్ లో చాలా ఏడుస్తాను. అది ఎవరికీ కనిపించనివ్వను. ఎందుకంటే ఆ సమయంలో మనపై మనం జాలి చూపించుకుంటాం. ప్రపంచం మనకు వ్యతిరేకంగా లేదని నమ్మాలి. మనకు మనమే అలా చేసుకున్నామని అనుకోవాలి. తర్వాత దానిని అక్కడితో వదిలేయాలి. కొన్నిసార్లు నిరాశ కలిగించే క్షణాలు ఉన్నాయి. అయితే ఇక చాలు.. దానిని అక్కడితో వదిలేసి ముందుకు సాగిపో అని నాకు నేను అనుకుంటాను" అని షారుక్ చెప్పాడుఇక జీవితానికి సంబంధించిన ఫిలాసఫీని కూడా ఈ సందర్భంగా షారుక్ తెలిపాడు. "ప్రపంచం మీకేమీ వ్యతిరేకంగా ఉండదు. ముందుకు సాగుతూనే ఉండాలి. మిమ్మల్ని మీరు ఓ చీమలాగా భావించాలి. నేను అందంగా కనిపించే చీమను (నవ్వుతూ..). కానీ చీమనే. కొన్నిసార్లు గాలి మనల్ని దూరం నెట్టేస్తుంది. అంతమాత్రాన గాలి మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు కాదు.
దాని పని అది చేస్తుంది. జీవితం కూడా అంతే. వైఫల్యానికి జీవితాన్ని నిందించడం సరికాదు. మనమేదో తప్పు చేశాం లేదంటే వ్యాపారంలో ఏదో తప్పు జరిగింది లేదంటే మన వ్యూహం, మార్కెటింగ్ లో తప్పు జరిగింది అనుకొని అదేంటో చూసి దానిని సరి చేసి మళ్లీ ముందుకు సాగాలి" అని షారుక్ చెప్పుకొచ్చాడు.
Latest News