ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీ పని చేయని రాజధాని బస్సు.. నరకానికి స్పెల్లింగ్ నేర్పించేలా ఆర్టీసీ ప్రయాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:37 PM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం సుఖప్రదం అనేది సంస్థ నినాదం. కానీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఆ సంస్థ చెబుతున్నంత సుఖప్రదమేమీ కాదనేది ప్రయాణికులు అనుభవపూర్వకంగా చెబుతోన్న మాట. బస్సుల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, పర్యవేక్షణ కొరవడం లాంటి కారణాలతో ఆర్టీసీ బస్సులు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవ్వాళే.. అంటే మే 21న సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరిన రాజధాని బస్సు.. ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టింది.


TS 04z 0323 నంబరున్న ఖమ్మం డిపో రాజధాని బస్సు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరింది. ఈ బస్సులో వెళ్తే త్వరగా గమ్యం చేరొచ్చని.. ఏసీ కావడంతో హాయిగా, ఉక్కపోత లేకుండా ఊరికి వెళ్లొచ్చని ప్యాసింజర్లు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు కావడానికి ఎంత సేపో పట్టలేదు.


ప్రయాణికులకు చుక్కలు చూపించిన ‘రాజధాని’ ప్రయాణం


పేరుకు రాజధాని బస్సయినా సరే అందులో ఏసీ సరిగా పని చేయలేదు. సిటీ దాటి నార్కెట్‌పల్లి వరకైనా చేరక ముందే.. ఊపిరి సరిగా ఆడక, కడుపులో తిప్పినట్లయ్యి.. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్యాసింజర్ల అవస్థలను గమనించిన డ్రైవర్.. నార్కెట్‌పల్లిలో బస్సు పైకి ఎక్కి వాటర్ పైపుతో నీళ్లు కొట్టాడు. ఏసీ సరిగా పని చేయకపోవడంతో.. బస్సు టాప్ మీద వాటర్ కొట్టిన ప్రభావంతో కాసేపయినా బస్సు లోప కాస్తయినా చల్లగా ఉంటుందనేది ఆ డ్రైవర్ ఆలోచన.


‘రాజధాని’ జర్నీ బాగుంటుందని ఎక్కితే.. ఏసీ పని చేయక ఉక్కపోత, గాలి సరిగా అందకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని ఆ బస్సులోని ప్రయాణికులు వాపోతున్నారు. నార్కెట్‌పల్లికి వచ్చే సరికే ఇలా ఉంటే ఖమ్మం వెళ్లే సరికి మా పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సూపర్ లగ్జరీ బస్సు ఎక్కినా కిటికీలు తెరిచి కూర్చుంటే గాలి వచ్చేదని.. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని బాధపడుతున్నారు. బస్సు బయల్దేరే ముందు ఏసీ సరిగా పని చేస్తుందో లేదో కనీసం చెక్ చేసుకోరా..? అని ప్రశ్నిస్తున్నారు.


ఏసీ బస్సుల్లో వెళ్లే వారి సమస్య ఇలా ఉంటే.. నాన్ ఏసీ బస్సుల్లో వెళ్లే వారి బాధ మరోలా ఉంది. మహిళలకు ‘మహాలక్ష్మీ’ ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో సీట్లు దొరకడం గగనమైపోయింది. బస్సు సర్వీసులు పెంచకపోవడం.. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో.. కూర్చోవడానికి సీట్లు లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. కేఎంపీఎల్ పెంచడం కోసం డ్రైవరన్నలు బస్సులను మెల్లగా నడుపుతుండటం.. ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపుతుండటంతో.. ప్రయాణ సమయం పెరిగిపోతుందని ప్యాసింజర్లు వాపోతున్నారు.


ఆర్టీసీ యాజమాన్యం బస్సుల మెయింటెనెన్స్‌ పట్ల శ్రద్ధ పెట్టాలని.. పాతబడిన వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని.. అప్పుడే ఆ సంస్థ చెబుతున్నట్లు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖప్రదం అవుతుందని లేకపోతే నరకప్రాయం అవుతుందని ప్యాసింజర్లు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa